తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

  • 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు అంటున్న గవర్నర్
  • విజయ్ కు తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం
  • అసెంబ్లీలో లో బలం నిరపించుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రకాశ్ రాజ్

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు న్యాయపోరాటం దిశగా మారుతోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మెజారిటీని సభలోనే తేల్చాలే తప్ప, ముందే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.


టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118కి ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉండటంతో, మద్దతు లేఖలు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేశారు. దీనికి ప్రతిస్పందనగా, తనకు సభలో బలాన్ని నిరూపించుకునే అవకాశం (Floor Test) ఇవ్వాలని విజయ్ కోరుతున్నారు. ఒకవేళ గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, విజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బొమ్మై కేసు (S.R. Bommai case) తీర్పు ప్రకారం మెజారిటీని సభలోనే నిరూపించుకోవాలనే నిబంధనను ఆధారం చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.


మరోవైపు, కావలసిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. అన్నాడీఎంకేలోని అసంతృప్త వర్గం లేదా ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు తెరవెనుక వేగంగా జరుగుతున్నాయి. ఒకవేళ సంఖ్యాబలం సమకూరితేనే రాజ్‌భవన్ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అటు రాజ్‌భవన్, ఇటు కోర్టు మెట్ల మధ్య దోబూచులాడుతున్నాయి. విజయ్ తదుపరి అడుగు ఎటు పడుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది


Vijay Tamilnadu
Tamil Nadu politics
Prakash Raj support
Rajendra Vishwanath Arlekar
TVK party
Government formation
Floor test
SR Bommai case
Tamil Nadu political crisis

More Telugu News